నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుతో పేద, మధ్య తరగతి ప్రజలపై ఎనలేని ఆర్థిక భారం పడనుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా పార్టీ ఆదేశాల మేరకు విద్యుత్ చార్జీల పెంపుపై శేరిలింగంపల్లి తహశీల్దార్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, రాష్ట్ర నాయకులు యోగానంద్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాన్ని అరికట్టేలా, సామాన్యులకు ఊరటనిచ్చేలా సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. ప్రతి 50 నుంచి 100 యూనిట్లకు శ్లాబుల పేరుతో చార్జీల భారాన్ని ప్రజలపై మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పేద ప్రజలకు పెనుభారంగా తీసుకున్న విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా పార్టీ ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మహిపాల్ రెడ్డి, హరికృష్ణ, రాంరెడ్డి, మణిక్ రావు, హరిప్రియ, చంద్రమోహన్, శ్రీనివాస్ రెడ్డి, మధు చారి, సత్య కురుమ, శ్రీరిష, గోవర్ధన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.