బిసి‌ జనగణన సాధించినపుడే బహుజన‌ రాజ్యాధికారం సాధ్యం – బిఎల్ఎఫ్ ఆవిర్భావ సభలో ప్రొఫెసర్ ఖాసీం

నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో జనగణనలో బిసి జనగణన సాధించినపుడే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుందని, అందుకోసం బహుజనులంతా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం అన్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 4వ ఆవిర్భావ ఆన్ లైన్ బహిరంగ సభను బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు యస్. సిద్దిరాములు అధ్యక్షతన హైదరాబాద్ బాగ్ లింగంపల్లి ఓంకార్ భవన్ బిఎన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాసీం మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాట కాలం నుంచి ఉద్దేశ పూర్వకంగా బిసి సమాజాన్ని అగ్రవర్ణ ఆధిపత్య శక్తులు అణిచివేతకు గురి చేస్తున్నాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్ రావడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్ర మరవలేనిదన్నారు. బిసి సామాజిక వర్గం గురించి పోరాడే వారు లేక, సైమన్ కమిషన్ ముందు వాదించే వారు లేక పోవటంతో అంబేద్కర్ పై వ్యతిరేకంగా బ్రిటీష్ వారికి ఉత్తరాలు రాసి అగ్రవర్ణం సృష్టించిన అనేక ఆటంకాలలో నాటి నుంచి నేటి వరకు బిసిలు సామాజిక, ఆర్థిక, రాజకీయ అణిచివేతకు గురవుతున్నారని వాపోయారు. బిసిల అభివృద్ధి, రిజర్వేషన్ కోసం 1953లో కాకా కేల్కర్ కమిటీని వేసినా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. బిసి జనగణన పోరాడి సాధించుకోవాలని పిలుపు నిచ్చారు.ఎంసిపిఐయూ జాతీయ కార్యదర్శి, బిఎల్ ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మద్దికాయల అశోక్ మాట్లాడుతూ జనాభా నిష్పత్తి ప్రకారం నీళ్ళు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ లో సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం పూర్తిగా కార్పోరేట్, పెట్టుబడిదారుల పరమైందన్నారు. ప్రజలను పక్క దారి పట్టించే ప్రకటనలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజన జనాభా నిష్పత్తి ప్రకారం నిధుల కేటాయింపు లేదని అన్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సరైన సైద్ధాంతిక రాజకీయ నిబద్దతతో ముందుకు వెళుతుందని ఏ పాలకవర్గ, అగ్రవర్ణ ఆధిపత్య శక్తులకు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లొంగిపోదని అన్నారు. తెలంగాణ సమాజం వీరతెలంగాణ రైతాంగ, మలి దశ తెలంగాణ సాధన ఉద్యమం స్పూర్తితో బహుజన రాజ్యాధికారం కోసం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వెంట పయనించాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్, రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, గాధ గోని రవి, వల్లెపు ఉపేందర్ రెడ్డి, మధు,‌ మారోజు సునీల్, ప్రకాష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ‌

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here