శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ మక్తా మహబూబ్‌పేట్‌లోని సర్వే నంబర్ 44 పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్న అక్రమ నిర్మాణాలపై సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో CMC కమిషనర్ సృజనకు 20 ఫిర్యాదులు చేసినట్లు BRS సీనియర్ నాయకుడు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి తెలిపారు. ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ CMC అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మియాపూర్ సర్కిల్-48 డిప్యూటీ కమిషనర్ జి. శ్రీనివాస్ ప్రజల సమస్యలపై కనీసం స్పందించకుండా, విజిటింగ్ అవర్స్‌లో వచ్చిన ప్రజలను కలవకుండా వ్యవహరిస్తున్నారని సంతోష్ రెడ్డి ఆరోపించారు.

CMC అధికారులు సీజ్ చేసిన భవనాలకు ఏర్పాటు చేసిన సీజింగ్ బోర్డులను తొలగించి తిరిగి నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. సీజ్ చేసిన భవనాల్లో నిర్మాణాలు పూర్తిచేసి గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయని, ఈ వ్యవహారంపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే అనేక నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్మాణాలు కొనసాగుతున్నాయని సంతోష్ రెడ్డి తెలిపారు. ప్రజల ఫిర్యాదులను పక్కనపెట్టి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. అక్రమ నిర్మాణాల వ్యవహారంపై విజిలెన్స్ డిపార్ట్‌మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టాలని సంతోష్ రెడ్డి డిమాండ్ చేశారు. CMC ఉన్నతాధికారులు, సైబరాబాద్ కమిషనర్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ జోక్యం చేసుకుని ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న భవనాలను తక్షణమే నిలిపివేయడంతో పాటు, సీజ్ చేసిన భవనాల సీజింగ్ బోర్డులను తొలగించి నిర్మాణాలు కొనసాగిస్తున్న బిల్డర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్యాయం జరిగితే ప్రజలు ఎవరికి చెప్పాలి? అని ప్రశ్నించిన సంతోష్ రెడ్డి, ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాలని, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మీడియా కూడా దృష్టి సారించాలని కోరారు.






