మోదీ పాలనకు 12 ఏళ్లు.. శేరిలింగంపల్లిలో హనుమాన్ చాలీసా, ప్రత్యేక పూజలు..

శేరిలింగంపల్లి, జూన్ 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ప్రధాని న‌రేంద్ర మోదీ పాలనకు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శేరిలింగంపల్లి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హనుమాన్ చాలీసా పఠనం కార్యక్రమాలు నిర్వహించారు. గంగారం హనుమాన్ ఆలయం, హుడా కాలనీ శివాలయంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశం విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే మూడు ప్రధాన సూత్రాలతో ముందుకు సాగుతోందన్నారు. 4,399 రోజుల పాలనలో వికసిత్ భారత్-2047 లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని పేర్కొన్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా 11 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో రూ.4.30 లక్షల కోట్లకు పైగా నేరుగా జమ చేసినట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తి, పాల ఉత్పత్తి రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదైందన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో 99 దేశాలకు వ్యాక్సిన్లు అందించడం, జీ-20 సదస్సును విజయవంతంగా నిర్వహించడం ద్వారా భారత్ అంతర్జాతీయంగా తన ప్రతిష్ఠను మరింత పెంచుకుందని చెప్పారు.

దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ జాతీయ రహదారుల విస్తరణ, గ్రామీణ రహదారుల నిర్మాణం, చీనాబ్ బ్రిడ్జ్, అటల్ టన్నెల్, పంబన్ బ్రిడ్జ్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. అలాగే వందే భారత్ రైళ్లు, కొత్త విమానాశ్రయాలు, స్టార్టప్ ఇండియా, యూపీఐ వంటి కార్యక్రమాలు దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా దేశ భద్రత విషయంలో రాజీపడని వైఖరిని కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించిందని, స్వచ్ఛ భారత్, ఫిట్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలు ప్రజల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చాయని తెలిపారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, తెలంగాణలో కూడా అదే అభివృద్ధి వేగం రావాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని రవికుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంలో తెలంగాణ ముందువరుసలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బల్దా అశోక్, రాఘవేందర్ రావు, వసంత్ కుమార్ యాదవ్, అనిల్ గౌడ్, మాణిక్ రావు, సింధూ రెడ్డి, రామ్ రెడ్డి, జితేందర్, మహేష్ యాదవ్, లక్ష్మణ్, పద్మ, దేవాల్ యాదవ్, రమేష్, అర్జున్, గణేష్, రమణయ్య, మేరీ, జ్యోతి, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here