సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కంతో బాలిక‌ల భ‌విష్య‌త్తుకు భ‌రోసా.. ప‌థ‌కం వివ‌రాలు..

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌.. దేశంలో ఉన్న బాలిక‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం అందుబాటులోకి తెచ్చిన ప‌థ‌క‌మిది. బాలిక‌ల‌కు చెందిన త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కులు వారి పేరిట నెల నెలా కొంత మొత్తాన్ని 15 ఏళ్ల పాటు పొదుపు చేస్తే వారికి 21 ఏళ్లు వ‌చ్చాక అకౌంట్ మెచూర్ అయి చేతికి డ‌బ్బులు వ‌స్తాయి. ఆ మొత్తంలో అమ్మాయి పెళ్లి చేసుకోవ‌చ్చు. లేదా ఉన్న‌త చ‌దువుల కోసం ఆ మొత్తాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇక ఈ ప‌థ‌కానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

10 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు లోపు ఉన్న బాలిక‌ల పేరిట సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కం కింద త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కులు అకౌంట్ ఓపెన్ చేయ‌వ‌చ్చు. ఒక‌రి పేరిట ఒకే అకౌంట్‌కు అనుమ‌తిస్తారు. కుటుంబంలో ఎంత మంది ఆడ‌పిల్ల‌లు ఉన్నా వారి పేరిట అకౌంట్లు తెరిచి డ‌బ్బులు పొదుపు చేయ‌వ‌చ్చు. ఈ అకౌంట్‌ను ఓపెన్ చేసే స‌మ‌యంలో బాలిక జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రంతోపాటు త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కుల‌కు చెందిన ప‌త్రాలను చూపించాల్సి ఉంటుంది.

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న కింద అకౌంట్‌ను రూ.250తో తెర‌వ‌చ్చు. నెల నెలా ఎంతైనా పొదుపు చేయ‌వ‌చ్చు. ఏడాదికి గ‌రిష్టంగా రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు పొదుపు చేసేందుకు అనుమ‌తి ఉంటుంది. ఏడాదిలో క‌నీసం రూ.250 అయినా డిపాజిట్ ఏయాలి. ఈ ప‌థ‌కం కింద 15 ఏళ్ల పాటు నెల నెలా డ‌బ్బుల‌ను డిపాజిట్ చేయాలి. ఏడాది పాటు ఏ ఒక్క నెల డిపాజిట్ చేయ‌క‌పోయినా అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది. అనంత‌రం ఏడాదికి రూ.50 చొప్పున పెనాల్టీ చెల్లించి అకౌంట్‌ను మ‌ళ్లీ యాక్టివేట్ చేయించుకోవ‌చ్చు.

ఈ ప‌థ‌కం కింద పొదుపు చేసే డ‌బ్బుల‌కు ఏడాదికి 8.4 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు.(ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి కొంత శాతం పెరగొచ్చు/తగ్గొచ్చు) ప్ర‌తి నెలా 5వ తేదీ వ‌ర‌కు అకౌంట్‌లో ఎంత డ‌బ్బు ఉంటే దానికి అంత వ‌డ్డీని చెల్లిస్తారు. ఈ క్ర‌మంలో ఏడాదికి రూ.1.50 ల‌క్ష‌లు పొదుపు చేస్తే 15 ఏళ్ల పాటు జ‌మ అయితే అకౌంట్‌లో రూ.45 ల‌క్ష‌లు ఉంటాయి. 21 ఏళ్ల త‌రువాత స్కీం మెచూర్ అవుతుంది క‌నుక అప్పుడు చేతికి సుమారుగా రూ.70 ల‌క్ష‌లు వ‌స్తాయి.

అమ్మాయిల‌కు 18 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు ఈ అకౌంట్‌ను త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కులు ఆప‌రేట్ చేస్తారు. వారికి 18 ఏళ్లు నిండాక వారే ఆప‌రేట్ చేసుకోవ‌చ్చు. అకౌంట్ హోల్డ‌ర్ చ‌నిపోతే డెత్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించి అకౌంట్ క్లోజ్ చేయ‌వ‌చ్చు. దీంతో జ‌మ చేసిన మొత్తానికి వ‌డ్డీ క‌లిపి చెల్లిస్తారు. ఆ మొత్తం త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కుల‌కు ల‌భిస్తుంది. ఒక‌వేళ అకౌంట్ హోల్డ‌ర్ ప్రాణాంత‌క వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్నా లేదా త‌ల్లిదండ్రులు, సంర‌క్ష‌కులు చ‌నిపోయినా అకౌంట్ క్లోజ్ చేసి డ‌బ్బులు తీసుకోవ‌చ్చు. దానికి కూడా వ‌డ్డీ చెల్లిస్తారు.

అమ్మాయికి 18 ఏళ్లు నిండాక లేదా 10వ త‌ర‌గ‌తి అయ్యాక జ‌మ చేసిన మొత్తం నుంచి 50 శాతం వ‌ర‌కు తీసుకోవ‌చ్చు. ఉన్న‌త విద్య చ‌దువుతామ‌ని రుజువు చేస్తే ఆ మొత్తం ఇస్తారు. లేదా 21 ఏళ్ల‌కు అకౌంట్ మెచూర్ అవుతుంది క‌నుక అప్పుడు య‌థావిధిగా చేతికి డ‌బ్బులు వ‌స్తాయి. అయితే 18 ఏళ్లు దాటాక అమ్మాయికి పెళ్లి చేయ‌ద‌లిస్తే అందుకు రుజువులు చూపించి అకౌంట్‌ను క్లోజ్ చేయ‌వ‌చ్చు. అప్పుడు మొత్తం సొమ్ముకు వ‌డ్డీ క‌లిపి చెల్లిస్తారు.

కేంద్ర ప్ర‌భుత్వ బేటీ బ‌చావో, బేటీ ప‌ఢావో కార్య‌క్ర‌మంలో భాగంగా ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించింది. దీని కింద బ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల్లో ఖాతా తెర‌వ‌చ్చు. అయితే ఈ ప‌థ‌కం ద్వారా ఏడాదికి క‌నీసం రూ.20వేలు పొదుపు చేసినా 21 సంవ‌త్స‌రాల త‌రువాత రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here