నమస్తే శేరిలింగంపల్లి: పరీక్షల సమయం సమీపిస్తున్న సమయంలో ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులను ఫీజుల పేరుతో ఇబ్బందులకు గురిచేయవద్దని జాతీయ బీసీ విద్యార్థి సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉరేళ్ల మహేష్ యాదవ్ అన్నారు. మరో నెల రోజులలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు హాల్ టికెట్స్ నెపంతో ఫీజులు తప్పకుండా చెల్లించాలని బలవంతం చేయొద్దన్నారు. ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సంబంధిత స్కూల్స్, కాలేజీల ముందు నిరసన తెలుపుతామని తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, విద్యా శాఖ మంత్రి, అధికార యంత్రాంగం ఫీజుల వసూళ్లపై చర్యలు తీసుకోవాలని అన్నారు.