చివరి గంటలో పోలింగ్ శాతంలో భారీ తేడా..?

  • శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో 7 డివిజన్లలో 10 శాతానికి పైగా పెరుగుదల
  • గచ్చిబౌలి డివిజన్ లో అత్యధికంగా 43 శాతం
  • అత్యల్పంగా మాదాపూర్ లో 35 % నమోదయ్యే అవకాశం.

నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ముగిసింది. జంట సర్కిళ్లలో 5 గం.ల వరకు జరిగిన పోలింగ్ లో అధికారులు అందించిన నివేదిక ప్రకారం చందానగర్ డివిజన్ మినహా మిగిలిన అన్ని డివిజన్లలో పోలింగ్ శాతం 30 కి మించలేదు. అయితే పోలింగ్ పూర్తయ్యే సమయానికి అంటే చివరి గంట సమయంలో పోలింగ్ శాతంలో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. అన్ని డివిజన్లలో దాదాపు పోలింగ్ శాతం 40 వరకు ఉన్నట్లు సమాచారం. అయితే చివరి గంట సమయంలో ఓటర్లు సైతం పోలింగ్ కేంద్రాల వద్ద పెద్దగా తారసపడలేదు. అయినప్పటికీ గంట సమయంలోనే పోలింగ్ శాతంలో భారీ తేడా ఉండటం చర్చనీయాంశంగా మారనుంది. అయితే వివిధ పార్టీల పోలింగ్ ఏజెంట్ల వద్ద గల కచ్చితమైన సమాచారం ప్రకారం చూస్తే అధికారులు 5 గంటల వరకు ఇచ్చిన నివేదిక ప్రకారం పోలింగ్ కు చాలా తేడా కనిపిస్తుంది. పోలింగ్ శాతం లో ఈ తేడా కు ప్రధాన కారణం ఎన్నికల సిబ్బంది అనుభవ రాహిత్యంగా తెలుస్తోంది. మొదటి సారి బోధనేతర సిబ్బంది ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావడం ఈ తప్పిదాలకు కారణంగా తెలుస్తోంది. ప్రతీ రెండు గంటలకు ఒకసారి ఉన్నతాధికారులకు అందించాల్సిన నివేదికను సమయానికి అందించాలనే ఉద్దేశంతో ఎన్నికల సిబ్బంది దాదాపు 40 నిమిషాల ముందు నమోదైన పోలింగ్ శాతాన్ని నివేదికలో అందించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే 5 గం.ల పోలింగ్ శాతానికి, పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ శాతంలో తేడాలు భారీగా కనబడనున్నాయి. పలు పార్టీల ఎన్నికల అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల వద్ద నుండి సేకరించిన సమాచారం ప్రకారం శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్ లో 38 శాతం, గచ్చిబౌలి డివిజన్ లో 43 , శేరిలింగంపల్లి డివిజన్ లో 41 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఇదే విధంగా చందానగర్ సర్కిల్ పరిధిలోని మియాపూర్ డివిజన్ లో 36, హఫీజ్ పేట్ డివిజన్ లో 39 , చందానగర్ డివిజన్ లో 38 మాదాపూర్ డివిజన్ లో 35 పోలింగ్ శాతం నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం. అధికారికంగా ప్రకటించే పోలింగ్ శాతానికి ఈ సమాచారానికి కొంత వ్యత్యాసం ఉండే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

1 COMMENT

  1. లాస్ట్ ఓట్ నాదే నేను వెళ్లినాక గేట్లు బంద్ చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here