– రెండవ రోజు ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
– మొదటి రోజు రూ.96,887(హుండీ మినహా) ఆదాయం
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్ శ్రీ తుల్జా భవాని ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు ఘనంగా జరిగాయి. ఆదివారం అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అవతారంలో పూజలు అందుకున్నారు. గతంతో పోలిస్తే తుల్జాభవాని అమ్మవారు ప్రత్యేక అలంకరణలో మొదటిసారి దర్శనమివ్వడం పట్ల స్థానిక భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా శనివారం ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పూజా కైంకర్యాలు, ఇతరత్రా సేవల నేపథ్యంలో ఒకే రోజు దేవాలయానికి రూ.96,887(హుండీ మినహా) ఆదాయం రావడం విశేషం. దీనిపై కొత్త పాలక మండలి చైర్మన్ మల్లికార్జున శర్మ , సభ్యులు సంజీవరెడ్డి, రేణుక శ్రీనివాస్ గౌడ్, గోవింద చారి, రవీందర్ సంపత్, రాజు తివారిలు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి కోసం మున్ముందు మరిన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి గాయత్రీ దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు.