ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న తమ నివాసంలో మంగళవారం నల్గొండ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన విషయం విదితమే. సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ పెడుతున్నారా ? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కానీ ఓ ప్రముఖ దినపత్రికలో ఇటీవల ఆమె పార్టీ పెడుతున్నారంటూ కథనం వచ్చాక ఇదే విషయంపై ఊహాగానాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో మంగళవారం ఆమె సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె తెలంగాణ జిల్లాల్లోని అందరు ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని, మీడియాకు చెప్పకుండా ఏదీ చేయనని ఆమె తెలిపారు. అయితే ఆమె కొత్త పార్టీ పెట్టడం లాంఛనమేనని, కాకపోతే అది ఎప్పుడు అన్నది త్వరలోనే తెలుస్తుందని వార్తలు వస్తున్నాయి. నిజానికి వైఎస్సార్‌సీపీ తెలంగాణలో లేదు. ఇరు రాష్ట్రాల సత్సంబంధాల నిమిత్తం తెలంగాణలో తమ పార్టీ కార్యకలాపాలను నిర్వహించడం లేదని గతంలోనే వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు తెలిపారు. దీంతో వైకాపా తెలంగాణలో ఉండదని స్పష్టమైంది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో షర్మిల కొత్త పార్టీ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక షర్మిల తన పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పేరును కూడా ఖరారు చేశారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సమావేశాలు జరుగుతున్నందున ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇదే పేరు దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. అయితే ఆమె పార్టీని పెడతారా, లేదా అన్న విషయం తేలాలంటే ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు.