- గ్రేటర్ అభివృద్ధికి భారీగా నిధులు ప్రకటించే చాన్స్ ?
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ నియోజకవర్గంలో గెలిచేందుకు బీజేపీ, తెరాస పార్టీలు సర్వ శక్తులను ఒడ్డాయి. గెలుపు మాదే అంటే మాదే అన్న ధీమాతో ఇరు పార్టీలు ప్రచారంలో దూసుకుపోయాయి. ఓ దశలో ఉప ఎన్నిక కాస్తా సాధారణ ఎన్నికను తలపించింది. ఇక ఉప ఎన్నిక ఫలితాల పట్ల కూడా గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. అయితే చివరకు దుబ్బాక పీఠం బీజేపీ వశమైంది. ఆధిక్యం స్వల్పమే అయినప్పటికీ గెలుపు గెలుపే కదా. కానీ గెలుపుపై చివరి వరకు ధీమాగా ఉన్న తెరాసకు ఓటమి షాక్ నిచ్చింది.
అయితే దుబ్బాకలో ఎందుకు ఓడిపోయామే విషయాన్ని ఇప్పుడు తెరాస విశ్లేషించుకుంటోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమై దుబ్బాక ఫలితాన్ని విశ్లేషించారు. అలాగే గ్రేటర్ లో రానున్న ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక రిజల్ట్ నేపథ్యంలో తెరాస ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. దుబ్బాక ఫలితమే గ్రేటర్‌లోనూ పునరావృతం కాకుండా ఉండాలని తెరాస వేగంగా వ్యహాలు రచిస్తోంది. అందులో భాగంగానే గ్రేటర్ లో గెలవడంపై ఆ పార్టీ నజర్ పెట్టింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రజలను తమవైపుకు తిప్పుకునేలా గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే గ్రేటర్ వాసులకు భారీ వరాలు ఇవ్వనున్నారని తెలిసింది.
శుక్రవారం సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో గ్రేటర్‌లో అభివృద్ధికి భారీగా నిధులు ప్రకటిస్తారని తెలుస్తోంది. గ్రేటర్‌లో ఏ డివిజన్‌లోనూ పార్టీకి వ్యతిరేకత ఎదురుకాకుండా ఉండేందుకు గాను అభివృద్ధి పనులపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నారని సమాచారం. అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులందరికీ యుద్ధ ప్రాతిపదికన సహాయం అందించాలని చూస్తున్నట్లు తెలిసింది. దీని వల్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత తగ్గుతుందని తెరాస భావిస్తున్నట్లు తెలిసింది. అయితే శుక్రవారం జరగనున్న కేబినెట్ భేటీ అనంతరం సీఎం ఏ వివరాలను వెల్లడిస్తారా ? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సమావేశం అనంతరం పై విషయాల మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది.