- ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన బెంజ్ కార్ డ్రైవర్
- వ్యక్తి అక్కడికక్కడే మృతి, మరో మహిళకు తీవ్ర గాయాలు, హాస్పిటల్ లో చికిత్స
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మద్యం మత్తులో ఓ వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుంగా అతి వేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపాడు. దీంతో రోడ్డుపై వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఓ జంటలో వ్యక్తి తీవ్రగాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మహిళకు తీవ్రగాయాలై హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 13వ తేదీన అర్థరాత్రి 1 గంట సమయంలో బుల్లెట్ ద్విచక్రవాహనంపై సికింద్రాబాద్ క్లబ్‌లో మేనేజర్‌గా పనిచేసే గౌతమ్‌దేవ్ అనే వ్యక్తి తన భార్య శ్వేతా శ్రావణితో కలిసి మాదాపూర్ నుంచి కొండాపూర్ వైపుకు వెళ్తున్నాడు. కాగా మార్గమధ్యలో సైబర్ టవర్స్ జంక్షన్ వద్దకు రాగానే ఐకియా నుంచి కూకట్‌పల్లి వైపుకు మెర్సిడెస్ బెంజ్ కారులో వెళ్తున్న ఓ వ్యక్తి సిగ్నల్ జంప్ చేసి అతి వేగంగా, నిర్లక్ష్యంగా కారును నడిపిస్తూ సదరు బుల్లెట్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బుల్లెట్ మీద ప్రయాణిస్తున్న గౌతమ్ దేవ్, శ్వేతా శ్రావణిలకు తీవ్రగాయాలయ్యాయి. గౌతమ్ దేవ్ అక్కడికక్కడే మృతి చెందగా, శ్వేతా శ్రావణిని చికిత్స నిమిత్తం మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆమె ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. కాగా సదరు బెంజ్ కార్ డ్రైవర్ మద్యం మత్తులోనే వాహనాన్ని నడిపించాడని, సిగ్నల్ జంప్ చేసి వేగంగా వెళ్లి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారు అతనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


