ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఏమోగానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్న విధంగా ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రభుత్వమేమో కరోనా ఉందని, ఎన్నికలు ఇప్పుడే వద్దని, మరో 3 నెలలు వాయిదా వేయాలని చెబుతూ వచ్చింది. ఇక ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ససేమిరా అంటూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా సుప్రీం కోర్టు కూడా పంచాయతీ ఎన్నికలను ఎట్టి పరిస్థితిలోనూ నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పడంతో ఇక ఏపీలో కచ్చితంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టమవుతోంది.
అయితే ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం పలువురు స్పందించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే ఆపి వాటికి బదులుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని ఎస్ఈసీ (రాష్ట్ర ఎన్నికల సంఘం) అంటుండడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మొండిగా వ్యవహరిస్తుండడం వల్లే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిందన్నారు. ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని అన్నారు.
కాగా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో మంత్రి బొత్స స్పందిస్తూ.. పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు తాము భయపడడం లేదని, కాకపోతే వ్యాక్సినేషన్, ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కష్టతరమవుతుందని అన్నారు. అందులో భాగంగానే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ వచ్చామని తెలిపారు.
అయితే కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడంతో ఇప్పుడు ఈ వ్యవహారంలో కేంద్రం ఇరుకున పడే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వ్యాక్సినేషన్ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలకు వెళ్తామని బొత్స తెలియజేశారు. దీంతో కేంద్రం ఈ వ్యవహారంలో ఇరుకున పడుతుందా ? అని విశ్లేషకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సినేషన్ ఉన్నందున ఎన్నికల నిర్వహణపై కేంద్రం ఏం చెబుతుందా ? అని ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారే ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుందని బొత్స చెప్పారు. దీంతో కేంద్రం కోర్టులోకి ఇప్పుడు బంతి వెళ్లినట్లు అయింది. మరి వ్యాక్సినేషన్‌కు కేంద్రం మొగ్గు చూపుతుందా, ఎన్నికలు, వ్యాక్సినేషన్ రెండు ప్రక్రియలను నిర్వహించమని చెబుతుందా ? అసలు ఏమని సమాధానం చెబుతుంది ? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.