- గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చందానగర్ టిఆర్ఎస్ లో భగ్గుమన్న విభేదాలు
భారత రాజ్యాంగం ద్వారా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఇరువురు నాయకుల ఆధిపత్య పోరు ఫలితంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకం అవమానానికి గురైంది. ఒకే వేదికపై ఇరు వర్గాల నాయకులు వేడుకలు జరిపే క్రమంలో జాతీయ పతాక నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వేడుకల్లో భాగంగా ఓ ప్రజాప్రతినిధి జాతీయ జెండాను ఎగురవేయగా, మరో వర్గానికి చెందిన కార్యకర్తలు అత్యుత్సాహంతో ఎగురవేసిన పతాకాన్ని తొలగించి మరో జెండాను ఏర్పాటు చేయడం వివాదానికి తెరలేపింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం…
చందానగర్ డివిజన్ కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం చందానగర్ గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. కొద్దిసేపటి తర్వాత తాజాగా ఎన్నికల్లో గెలుపొందిన మంజుల రఘునాథ్‌రెడ్డి అనుచరులు వచ్చి జాతీయ జెండాను తొలగించి మరో జెండాను ఏర్పాటు చేయగా, మంజుల రఘునాథ్‌రెడ్డి జెండాను ఎగురవేశారు. ఈ విషయం గమనించిన నవతరెడ్డి తాను ఎగురవేసిన జెండాను వెంటనే ఎలా తొలగిస్తారు అని ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాల నేతలు చందానగర్ పోలీసులకు వివాదంపై వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
జాతీయ జెండాను, నాయకులను అవమానించిన వారిని కఠినంగా శిక్షించాలి: బొబ్బ నవతరెడ్డి
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయపతాకాన్ని అవమానించిన వారిని కఠినంగా శిక్షించాలని చందానగర్ కార్పొరేటర్ బొబ్బనవతరెడ్డి డిమాండ్ చేశారు. ప్రతీ సంవత్సరం నిర్వహించే వేడుకల్లో భాగంగా మంగళవారం చందానగర్ గాంధీ విగ్రహం వద్ద తాను కార్యకర్తలతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశానన్నారు. కొంత సమయం తరువాత నూతనంగా కార్పొరేటర్ గా ఎన్నికైన మంజుల రఘునాథ్ రెడ్డి తన అనుచరులతో వచ్చి తాను ఎగురవేసిన పతాకంతో పాటు గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలను దౌర్జన్యంగా తొలగించారని తెలిపారు. అనంతరం మరో జెండాను ఎగురవేసి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో తాను ఈ విషయమై చందాగనర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. జాతీయ పతాకాన్ని, జాతిపిత మహాత్మాగాంధీ, అంబేడ్కర్ లను అవమానించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
గతంలో వేడుకలు జరిపాం, ఈ వేడుకలకు ఏర్పాటు చేశాం: రఘునాథ్ రెడ్డి
గత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో తామే ఇక్కడ వేడుకలు నిర్వహించామని, ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సైతం జెండా దిమ్మెను శుభ్రపరిచి, రంగులు వేసి సిద్ధం చేశామని చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు రెడ్డి రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఉదయం నవత రెడ్డి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తాము సిద్ధం చేసిన దిమ్మెపై జెండాను ఎగురవేసిందని తెలిపారు. కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా వేడుకలు జరుగుతాయని ఆశించిన పార్టీ కార్యకర్తలు నిరుత్సాహం చెంది పొరపాటుగా జెండాను తొలగించారన్నారు. తమకు ముందస్తు సమాచారం అందించి ఉంటే నవతరెడ్డి చేతుల మీదుగానే వేడుకలు జరిపించే వారిమని, సొంతపార్టీ నాయకులకు సమాచారం అందించకుండా జెండావిష్కరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. అయితే తాము జాతీయ జెండా ఎగురవేసి గీతాన్ని ఆలపించే సమయంలో నవతరెడ్డి కూర్చొని జాతీయగీతాన్ని అవమానపరిచిందని ఆరోపించారు. ఈ విషయమై చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.
ఘటనపై విచారణ జరుపుతున్నాం: ఇన్‌స్పెక్టర్ క్యాస్ర్టో రెడ్డి
వేడుకల్లో జరిగిన ఘటనపై ఇరువర్గాల నుండి ఫిర్యాదులు అందాయని చందానగర్ ఇన్‌స్పెక్టర్ క్యాస్ర్టోరెడ్డి తెలిపారు. గాంధీ విగ్రహం సమీపంలోని సిసికెమెరాలను పరిశీలించి విచారణ జరుపుతున్నామని, చట్టవ్యతిరేక చర్యలను సహించేది లేదని తెలిపారు. జాతీయ పతాకాన్ని అవమానించేలా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.