- కోవిదా సహృదయ ఫౌండేషన్ సహకారంతో ఘనంగా వివాహవేడుక
నమస్తే శేరిలింగంపల్లి: వారిరువురూ దివ్యాంగులు, ఆపై అనాథలు. ఏడేళ్లక్రితం పరిచయమైన వారిరువురి మధ్య చిగురించిన ప్రేమ “సహృదయుల” సహకారంతో మూడుముళ్ల బంధంగా మారింది. మియాపూర్ లోని ధర్మపురి క్షేత్రం ఈ విశిష్ట వివాహానికి వేదికైంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే…జనగాం జిల్లా ఎనొత్తుల గ్రామానికి చెందిన మచ్చసునీల్ మలక్‌పేట్‌లోని ఆర్థోపెడిక్ హ్యాండీక్యాప్డ్ హాస్టల్లో డిగ్రీవరకు చదువుకున్నాడు. పోలియో కారణంగా ఇతనికి కుడి కాలు పనిచేయదు. సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి చెందిన ధార సంతోష చంపాపేట ఒహెచ్ గర్ల్స్ హాస్టల్ ఉంటోంది. సంతోషకు పోలియో కారణంగా రెండు కాళ్లు పనిచేయడం లేదు.
కాగా ఏడు సంవత్సరాల క్రితం పరిచయమైన వీరిరువురూ ప్రేమికులుగా మారారు. అనాథలు, దివ్యాంగుల వివాహాలకు కోవిదా సహృదయ ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తున్న డాక్టర్ అనూహ్యరెడ్డి వీరి ప్రేమ విషయాన్ని సునీల్ స్నేహితుడు వెంకట్‌దాస్ ద్వారా తెలుసుకున్నారు. వెంటనే వారితో మాట్లాడి పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వధూవరులకు నూతన వస్త్రాలు, తాళిబొట్టు అందించి ధర్మపురి క్షేత్రంలో వేద పండితుల ఆశీర్వచనాలతో ఆత్మీయ బంధువుల సమక్షంలో కన్నుల పండువగా నిర్వహించారు. వివాహ వేడుకకు తెలంగాణ ఎలక్ట్రానికి మీడియా జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, రాధమ్మకూతురు సీరియల్ నిర్మాత ఆర్ కె, జర్నలిస్టులు కబీర్, శ్యామ్, వినయకుమార్పుట్ల, సురేష్, లక్ష్మీనారాయణ, వరుణ్, శ్రీనివాస్, శ్రీపతి, విజయ్, శశికాంత్, ప్రవీణ్, లు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కోవిదా సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సునీల్, సంతోషల వివాహం 48వది కావడం గమనార్హం.