
గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): వేగంగా వెళ్తూ అదుపుతప్పిన ఓ లారీ హైటెన్షన్ స్థంబాన్ని ఢీ కొట్టడంతో విద్యుత్ తీగ తెగిపడిన ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తీగ ఎవరినీ తగలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో మంగళవారం ఓ టిప్పర్ లారీ అదుపుతప్పి హైటెన్షన్ విద్యుత్ స్థంబాన్ని ఢీ కొట్టడంతో విద్యుత్ తీగ తెగి రోడ్డుపై పడింది. వెంటనే అప్రమత్తమైన ట్రాన్స్కో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తక్షణ చర్యలను చేపట్టారు. లారీ డ్రైవర్ ఘటన స్థలం నుండి పరారయ్యాడు. విద్యుత్ తీగ ఎవరికీ తగలకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటన కారణంగా సుమారు రూ.1 కోటి నష్టం జరిగినట్లు ట్రాన్స్కో అధికారులు తెలుపుతున్నారు. క్రేన్ సహాయంతో విద్యుత్ తీగలకు మరమ్మత్తులు చేపట్టి సరఫరాను పునరుద్దరించే పనిలో అధికారులు ఉన్నారు.





