- భెల్ పూర్వ సీఎండీ బిపీ రావు చేతుల మీదుగా ఋత్వికులకు, దాతలకు సత్కారం
- ఉత్సవాల విజయవంతంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు: యూవీ రమణమూర్తి
నమస్తే శేరిలింగంపల్లి: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చందానగర్ శిల్ప ఎన్‌క్లేవ్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ ప్రాంగణంలో గత పది రోజులుగా ఎంతో వైభవోపేతంగా కొనసాగుతున్న లక్షదీపోత్సవం శుక్రవారంతో ఘనంగా ముగిసింది. చివరి రోజు సాముహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్రతం ఆచరించారు. సాయత్రం జరిగిన దీపోత్సవంలో బిహెచ్ఈఎల్ పూర్వ సీఎండీ బి.ప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనం చేశారు. అనంతరం వారి చేతుల మీదుగా ఉత్సవాల విజయవంతం కోసం కృషి చేసిన ఋత్వికులకు, దాతలకు, ఆలయ కమిటి సభ్యులకు,సేవకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బిపి రావు మాట్లాడుతూ పదిరోజుల పాటు ఎంతో సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వైభవంగా ముగించుకోవడం గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను వారు అభినందించారు.
ఆలయ ప్రధానార్చకులు వేదుల పవన్‌కుమార్ శర్మ, మురళీధర శర్మల పర్యవేక్షణలో జరిగిన ఈ ఉత్సవాల్లో విశిష్ట అతిథిగా భెల్ అంబాసిడర్, విజయ హాస్పిటల్ ఎండీ అల్లం పాండురంగారావు, చందానగర్ శ్రీ వెంకటేశ్వరాలయ ప్రధానార్చకులు శ్రీ సుదర్శనం సత్యసాయి, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యూవీ రమణమూర్తి, సభ్యులు చెన్నారెడ్డి, వాస్తు సిద్ధాంతి ప్రసాద శర్మ, శిల్ప ఎన్‌క్లేవ్ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరి రోజు, కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఉత్సాహంగా పదివేల దీపాలు వెలిగించారు. ఉత్సవాల విజయవంతో భాగస్వాములైన వారందరికి ఆలయ చైర్మన్ యూవీ రమణమూర్తి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.