– ఈ నెల 17 నుంచి 25 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): దీప్తీశ్రీనగర్ శ్రీ ధర్మపురి క్షేత్రం శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యింది. శనివారం నుంచి శ్రీధర్మపురి క్షేత్రంలో శ్రీ శార్వరీనామ దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు స్వర్ణాలంకృత కనకదుర్గాదేవి, రెండవరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి, మూడవరోజు శ్రీ గాయత్రీదేవి, నాల్గవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి, ఐదవ రోజు శ్రీ సరస్వతీ దేవి, ఆరవరోజు శ్రీ లలితా త్రిపురసుందరీదేవి, ఏడోరోజు మహాలక్ష్మీ దేవి, ఎనిమిదవ రోజు శ్రీ మహిషాసురమర్ధని దేవి, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో అమ్మవార పూజలు అందుకుంటారని ఆలయ వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 25 వరకు ప్రతిరోజు ప్రాతఃకాలం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. శ్రీ ధర్మపురి క్షేత్ర దసరా ఉత్సవాలలో పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
విద్యుత్‌దీప కాంతులలో వెలిగిపోతున్న శ్రీ ధర్మపురి క్షేత్రంలోని అమ్మవారి ఆలయం