చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): అనారోగ్య సమస్యను తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని గోపీనగర్‌లో నివాసం ఉండే జానీ బేగంకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కాగా సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆమె తన మనవడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లింది. రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చింది. అయితే అప్పటికి తన కుమారుడు మహమ్మద్ బాబా (21) ఇంకా ఇంటికి రాలేదని గుర్తించింది. అతను ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతని గదిలో అతను లేకపోవడంతో అతను ఇంకా రాలేదని గుర్తించి ఆమె వేరే గదిలోకి వెళ్లి నిద్రించింది. కాగా రాత్రి మంగళవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో టాయిలెట్ కోసం జానీ బేగం నిద్ర లేచింది. తన కుమారున్ని చూసేందుకు అతని గదికి వెళ్లగా.. తలుపు ఓపెన్ చేసి ఉండడం గమనించింది. అనుమానం వచ్చిన ఆమె గదిలోకి వెళ్లి చూసింది. అప్పటికే బాబా తన గదిలో సీలింగ్ రాడ్‌కు గ్రీన్ ప్లాస్టిక్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీలింగ్‌కు వేలాడుతున్న కొడుకు మృతదేహాన్ని చూసి ఆమె ఇరుగు పొరుగు వారికి సమాచారం అందించింది. ఈ మేరకు సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాబా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా బాబా గత 5 ఏళ్ల నుంచి ఫిట్స్ సమస్యతో బాధపడుతున్నాడని, అందుకనే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అతని తల్లి జానీ బేగం పోలీసులకు తెలిపింది. తన కుమారుడి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని ఆమె తెలియజేసింది.