శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (నమస్తే శేరిలింగంపల్లి): ఉద్యోగం రావట్లేదని తీవ్ర మనస్థాపానికి చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక రైల్వే పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిడుగు రాళ్లకు చెందిన బ్రహ్మా రెడ్డి (27) అనే యువకుడు కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ పీజీ హాస్టల్‌లో నివాసం ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినప్పటికీ ఉద్యోగం రావట్లేదని గత కొంత కాలంగా విచారంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లేదని తీవ్ర మనోవేదనకు గురైన బ్రహ్మా రెడ్డి తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నానని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జేమ్స్ హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






