సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): నకిలీ అయిన, నాణ్యతలేని హెల్మెట్లను తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులు ఈ మేరకు సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

నగరంలో హెల్మెట్లను ధరించకపోవడం, నాణ్యతలేని హెల్మెట్లను ధరించడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురైనప్పుడు అధిక శాతం మంది చనిపోతున్నారు. అలాగే తీవ్రగాయాల బారిన పడుతున్నారు. ఈక్రమంలో విషయం పసిగట్టిన సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నకిలీ హెల్మెట్లను తయారు చేసి విక్రయిస్తున్న వారిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఘజియాబాద్‌కు చెందిన ధీరజ్ కుమార్, అనిల్ కుమార్‌లు నకిలీ హెల్మెట్లను అక్కడ తయారు చేసి నగరానికి తెచ్చి విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో వారిని ఘజియాబాద్‌లో అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు.

ధీరజ్ కుమార్ తన ఆశీర్వాద్ హెల్మెట్స్ అండ్ యాక్ససరీస్ పరిశ్రమ ద్వారా ఓ2 పేరిట హెల్మెట్లను తయారు చేస్తుండగా, అనిల్ కుమార్ వెల్ఫేర్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా వెల్ఫేర్, హుడ్, డ్యూరో హెల్మెట్లను తయారు చేస్తున్నాడు. నకిలీ హెల్మెట్ల తయారీకి రూ.100 నుంచి రూ.200 అవుతుంది. కానీ వీరు వాటిని రూ.500 కు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో వాహనదారులు నకిలీ హెల్మెట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, నాణ్యమైన హెల్మెట్లనే కొనుగోలు చేయాలని పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా పోలీసులు నిందితుల నుంచి నకిలీ హెల్మెట్లు కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు.
