చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్‌కు చెందిన కె.రాధాకృష్ణ కుమారుడు సంతోష్ కుమార్ (18) శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. తల్లిదండ్రులకు ఫోన్‌లో ఓ మెసేజ్ పంపించాడు. ఈ రోజు నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నాను. అమ్మా.. నువ్వు నా వల్ల ఇబ్బందులు పడుతున్నావు, అందుకు నన్ను క్షమించు, గుడ్ బై.. అంటూ మెసేజ్ పంపించాడు. దీంతో అతని తల్లిదండ్రులు అతనికి ఫోన్ కాల్ చేయగా ఫోన్ స్విచాఫ్ వచ్చింది. ఈ క్రమంలో వారు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నల్లగండ్లలోని హుడా ప్లాట్స్‌లో సంతోష్ కుమార్ మృతదేహం కనిపించింది. అతను ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకుని చనిపోయాడు. ఈ మేరకు అతని మృతదేహాన్ని చందానగర్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.