- ముందస్తు సమాచారం లేకుండా కూల్చారని యజమానుల ఆరోపణ
- స్థలాల్లో పొజిషన్‌లో ఉన్నామని వెల్లడి
- మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ పోలీసులు వక్ఫ్ బోర్డు అధికారులపై కేసు నమోదు చేశారు. ఓ స్థలంలో కొందరు యజమానులు నిర్మించుకున్న షెడ్లను అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేశారని వారిపై స్థల యజమానులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌లోని గుట్టలబేగంపేట్ లో ఉన్న పల్లవి ఎన్ క్లేవ్ సర్వే నంబర్ 1 -9 లోని 93 ఎకరాల స్థలంలో 300 మంది యాజమానులు పలు రకాల వ్యాపారాల నిమిత్తం షెడ్లు నిర్మించుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. కాగా శనివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో వక్స్ బోర్డ్ ఇన్‌స్పెక్టర్ హయద్ ఖాన్ తన సిబ్బందితో కలిసి సదరు స్థలానికి వచ్చి ఆ షెడ్లను తొలగించారు. దీంతో ఆ స్థల యజమానులు స్పందిస్తూ తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ షెడ్లను కూల్చివేశారని అన్నారు. 1998 లో స్థలాలను కొని రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని రకాల డాక్యుమెంట్లతో పొజిషన్‌లో ఉన్నామని, అయినప్పటికీ వక్స్ బోర్డ్ అధికారులు కూల్చివేతలు చేపట్టడం సరికాదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వక్స్ బోర్డ్ అధికారులు స్థలాల యజమానులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తెల్లవారు జామున 4 గంటల సమయంలో షెడ్లను కూల్చివేశారని అన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఈ విధంగా కూల్చివేతలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పల్లవి ఎన్ క్లేవ్ ప్రతినిధులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.