మాదాపూర్‌లో అక్రమంగా దిగుమతి సిగరెట్ల విక్రయం.. పాన్‌షాప్ యజమాని అరెస్ట్

శేరిలింగంప‌ల్లి, జూలై 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు అక్రమంగా దిగుమతి చేసిన సిగరెట్లను విక్రయిస్తున్న పాన్‌షాప్‌పై దాడి చేసి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం గురువారం మధ్యాహ్నం సమయంలో అయ్యప్ప సొసైటీలోని ఎస్-స్మార్ట్ ఎదుట ఉన్న Pan.com Pan Shop లో విదేశీ సిగరెట్ల‌ను అక్రమంగా విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ కె. రాఘవేంద్ర గౌడ్, పోలీసు సిబ్బంది దుకాణంపై దాడి నిర్వహించారు. పోలీసులను గమనించిన దుకాణ యజమాని పరారయ్యేందుకు ప్రయత్నించగా, వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దుకాణాన్ని తనిఖీ చేయగా కౌంటర్ వెనుక భాగంలో దాచిపెట్టిన విదేశీ సిగరెట్ల ప్యాకెట్లు, ఓసీబీ (OCB) పేపర్లు లభ్యమయ్యాయి.

అరెస్టు చేసిన నిందితుడిని ఎండీ నిజాముద్దీన్ (58)గా గుర్తించారు. అతను కార్వాన్‌లోని హనుమాన్ గల్లీకి చెందిన పాన్‌షాప్ యజమాని అని పోలీసులు తెలిపారు. విచారణలో పాన్‌షాప్ ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఎక్కువ లాభాల కోసం ధర్మేందర్ అనే వ్యక్తి నుంచి దిగుమతి సిగరెట్లను కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. దాడిలో నిందితుడి నుంచి ప‌లు వ‌స్తువుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 7 ప్యాకెట్ల గ‌ర‌మ్ సిగ‌రెట్లు, 9 ప్యాకెట్ల ఎస్సె స్పెష‌ల్ గోల్డ్ సిగ‌రెట్లు, 4 ప్యాకెట్లు బ్లాక్‌, 1 ప్యాకెట్ ద‌న్‌హిల్‌, 3 ప్యాకెట్లు పారిస్‌, 6 ప్యాకెట్లు ఎస్సె బ్లాక్‌, 10 ప్యాకెట్లు విన్‌, 7 ప్యాకెట్లు మాండ్‌, 16 ప్యాకెట్లు ఎస్సె లైట్‌, 18 ప్యాకెట్ల ఓసీబీ పేప‌ర్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ పంచనామా నిర్వహించి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసును ఎస్‌ఐ బాలరాం దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here