హోటల్‌లో యువతి మృతి.. ప్రియుడి కోసం పోలీసుల గాలింపు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్‌ సిద్ధిక్‌నగర్‌లోని ఓ హోటల్‌లో బస చేసిన 29 ఏళ్ల ప్రైవేట్‌ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కొత్తగూడలోని అపోలో ఆసుపత్రి నుంచి అందిన సమాచారంతో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన షారన్‌ నిఖిత తోప్నో, ఆమె ప్రియుడు శ్రీనివాస రవి తేజ కలిసి సోమవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో మాదాపూర్‌ సిద్ధిక్ నగర్‌ రోడ్‌ నంబర్‌ 5లోని OSLN టెర్మినస్‌ హోటల్‌లోని 304వ గదిలో బస చేశారు.

అనంతరం నిఖిత అపస్మారక స్థితిలో కనిపించడంతో హోటల్‌ సిబ్బంది సహాయంతో ఆమెను కొత్తగూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలిసిన వెంటనే రవి తేజ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి ముఖంపై స్వల్ప గాయాలు ఉన్నట్లు ప్రాథమిక పరిశీలనలో గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న క్లూస్‌ టీమ్‌ హోటల్‌ గదిని పరిశీలించి, ఆధారాల సేకరణ కోసం గదిని భద్రపరిచింది. మరోవైపు ఘటన అనంతరం రవి తేజ తన మొబైల్‌ ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. యువతి మృతికి గల కారణాలు, హోటల్‌ గదిలో ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here