శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): పోగొట్టుకున్న, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను సైబరాబాద్ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆదేశాల మేరకు CEIR పోర్టల్ ద్వారా చేపట్టిన 11వ విడత రికవరీలో మొత్తం 1,218 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.43 కోట్లుగా పోలీసులు తెలిపారు. రికవరీ చేసిన ఫోన్లలో CCS కూకట్‌పల్లి పోలీసులు 410, CCS శేరిలింగంపల్లి పోలీసులు 407, CCS కుత్బుల్లాపూర్ పోలీసులు 401 ఫోన్లను రికవరీ చేశారు. అనంతరం ఆయా ఫోన్లను సంబంధిత బాధితులకు స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ.. ప్రజలు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే బాధితులు CEIR పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. నేటి రోజుల్లో మొబైల్ ఫోన్ ఉపాధి, వ్యక్తిగత అవసరాలకు కీలక సాధనంగా మారిందని.. పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి యజమానులకు అందించడం పోలీసుల బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. ముఖ్యంగా జాబ్ ఫ్రాడ్స్, బెట్టింగ్ యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, మొబైల్ నంబర్ వంటి సమాచారాన్ని ఇవ్వకూడదని హెచ్చరించారు.

మార్కెట్లు, బస్‌స్టాప్‌లు, ఉత్సవాలు జరిగే ప్రాంతాలు వంటి రద్దీ ప్రదేశాల్లో విలువైన వస్తువులపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని సూచించారు. ఇళ్ల దొంగతనాల నివారణకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు లేదా విహారయాత్రలకు వెళ్లే సమయంలో ఇంటి నుంచి దూరంగా ఉన్న విషయాన్ని సోషల్ మీడియాలో బహిరంగంగా షేర్ చేయకూడదని సూచించారు. మొబైల్ ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన CCS సిబ్బంది, పోలీసు అధికారులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
రికవరీ చేసిన మొబైల్ ఫోన్లు అందుకున్న పలువురు బాధితులు తమ అనుభవాలను పోలీసులతో పంచుకున్నారు. KPHBలో టీ తాగేందుకు వెళ్లిన సమయంలో తన iPhone 17 Proను మర్చిపోయానని సృజన తెలిపారు. ఫోన్‌కు కాల్ చేసినప్పుడల్లా స్విచ్‌ఆఫ్ రావడంతో తిరిగి దొరుకుతుందో లేదోనని ఆందోళన చెందానని, అయితే పోలీసులు కృషి చేసి ఫోన్‌ను తిరిగి అందజేయడంతో సంతోషంగా ఉందని చెప్పారు. TCSలో పనిచేస్తున్న నారాయణ చౌదరి తన Motorola ఫోన్ కోకాపేటలోని ఓ రెస్టారెంట్‌లో పోయిందని, నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. చాలా కాలం గడిచిపోవడంతో ఫోన్ ఇక దొరకదని భావించానని.. పోలీసులు ఫోన్ దొరికిందని అకస్మాత్తుగా ఫోన్ చేయడంతో ఎంతో ఆనందంగా అనిపించిందని చెప్పారు.
మెదక్‌కు చెందిన మహమ్మద్ ముఖిబ్ కూకట్‌పల్లిలో Zomato, Swiggyలో పనిచేస్తున్న సమయంలో Alsaba హోటల్ వద్ద తన ఫోన్ పోగొట్టుకున్నట్లు తెలిపారు. ఫోన్‌లో బ్యాంక్ ఖాతా వివరాలు, ఇతర ముఖ్యమైన సమాచారం ఉండటంతో దుర్వినియోగం జరుగుతుందేమోనని భయపడ్డానని చెప్పారు. పోలీసులు ఫోన్‌ను రికవరీ చేసి తిరిగి అందజేయడంతో సంతోషం వ్యక్తం చేశారు. బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి Sattva Knowledge Cityలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సమయంలో తన ఫోన్ దొంగిలించబడిందని తెలిపారు. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోన్ తప్పకుండా దొరుకుతుందని ధైర్యం చెప్పారని, అనంతరం CCS పోలీసులు ఫోన్ చేసి అది రికవరీ అయినట్లు చెప్పడంతో ఎంతో ఆనందంగా అనిపించిందని తెలిపారు. సైబరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్రైమ్స్ డీసీపీ ఎ. ముత్యం రెడ్డి, క్రైమ్స్ ఏసీపీలు వై. నాగేశ్వర్ రావు, ఎస్. వెంకటేష్, ఇన్‌స్పెక్టర్లు పీ. జగదీశ్వర్ (CCS కూకట్‌పల్లి), జి. సత్యనారాయణ (CCS కుత్బుల్లాపూర్), ఎస్. విజయ్ (CCS శేరిలింగంపల్లి), జి. మురళీకుమార్ (CCS నార్సింగి) తదితరులు పాల్గొన్నారు.





