శేరిలింగంపల్లి, జూలై 23 (నమస్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో ప్రత్యేకంగా రూపొందించిన సైకత శిల్పం పర్యాటకులను ఆకట్టుకుంది. శేరిలింగంపల్లికి చెందిన ఉద్యమకారుడు చిర్రా రవీందర్ యాదవ్ ఈ శిల్పాన్ని ఏర్పాటు చేశారు. సైకత శిల్పంపై ఫ్యూచర్ సీఎం ఆఫ్ తెలంగాణ, మారింది ప్రభుత్వమే.. ప్రజల మనస్సులో స్థానం కాదు వంటి సందేశాలను పొందుపరిచారు. కేటీఆర్ తెలంగాణ ప్రజల నమ్మకమని నిర్వాహకులు పేర్కొన్నారు.

పూరీ బీచ్‌కు వచ్చిన పర్యాటకులు సైకత శిల్పం వద్ద ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ శిల్పం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా చిర్రా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంలో కేటీఆర్ నాయకత్వానికి ప్రజల మద్దతు పెరుగుతోందని అన్నారు. ప్రస్తుతం ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా చిర్రా రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.





