శేరిలింగంపల్లి, జూలై 24 (నమస్తే శేరిలింగంపల్లి): వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌తో కలిసి శేరిలింగంపల్లి జోన్‌లోని శేరిలింగంపల్లి సర్కిల్ శేరిలింగంపల్లి వార్డును సందర్శించారు. ఈ సందర్భంగా వార్డులోని పౌర మౌలిక సదుపాయాలను పరిశీలించి, వివిధ శాఖల అధికారులతో కలిసి సమస్యలను సమీక్షించారు. పర్యటన సందర్భంగా డోయెన్స్ టౌన్‌షిప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులతో కమిషనర్ సమావేశమై వార్డు పరిధిలోని పౌర సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ, నాలాలు, చెరువుల పునరుద్ధరణ, సీసీ రోడ్లు, పార్కుల అభివృద్ధి, వీధి దీపాలు, చెట్ల కొమ్మల తొలగింపు, రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు, ట్రాఫిక్ నిర్వహణ, సీసీటీవీ కెమెరాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు, దోమల నివారణ, మార్కెట్ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలను ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.

వార్డులో గుర్తించిన అన్ని సమస్యలను అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని, శాఖల మధ్య సమన్వయంతో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ చేపట్టిన చర్యలపై ఎప్పటికప్పుడు కంప్లయన్స్ నివేదికలు సమర్పించాలని సూచించారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం, మౌలిక సదుపాయాలపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించడం, శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసి మెరుగైన మున్సిపల్ సేవలు అందించడమే వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రికల్, యూబీడీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.





