శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్న ఓ ఆర్ఎస్ఐ మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తాళ్లపల్లి రాజ సాంబయ్య (60) సిద్ధిరేట కమిషనరేట్‌లో ఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అనారోగ్య కారణాలతో అతను చికిత్స కోసం హైటెక్‌సిటీలోని యశోద హాస్పిటల్లో ఈ నెల 7వ తేదీన అడ్మిట్ అయ్యాడు. చికిత్సలో భాగంగా ఈ నెల 10వ తేదీన హాస్పిటల్ వైద్యులు సాంబయ్యకి మెదడుకు సర్జరీ చేశారు. అదే రోజు మళ్లీ అతనికి ఇబ్బంది ఎదురవగా వైద్యులు మెదడుకు సంబంధించి మరో సర్జరీ చేశారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న అతను శుక్రవారం మృతి చెందాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందాడని సాంబయ్య భార్య తిరుపతమ్మ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






