శేరిలింగంపల్లి, జూలై 16 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జెప్టో డెలివరీ బాయ్‌పై దోపిడీకి పాల్పడిన కేసులో సీరియల్ నేరస్థుడు బసోడి అభిషేక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీస్ సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి రూ.400 నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 13న అర్ధరాత్రి 12.50 గంటల సమయంలో జెప్టో డెలివరీ బాయ్ బ్యాటరీ బైక్‌పై గోపాల్‌రావు నగర్ రోడ్ నెం.18లో ఆర్డర్ డెలివరీకి వెళ్తుండగా, శిల్పా అవెన్యూ కాలనీ వద్ద స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడిని అడ్డగించారు. బాధితుడిపై దాడి చేసి, చంపేస్తామని బెదిరించి మొబైల్ ఫోన్‌ను అన్‌లాక్ చేయించారు. అనంతరం అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.900ను తమ ఖాతాకు బదిలీ చేసుకుని, జేబులో ఉన్న రూ.5వేల నగదును కూడా లాక్కొని పరారయ్యారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు బసోడి అభిషేక్‌ను అరెస్టు చేశారు. అతనిపై గతంలో మధురానగర్, మియాపూర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లలో దోపిడీ, చోరీలకు సంబంధించిన నాలుగు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన సహచరులతో కలిసి రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి నగదు, విలువైన వస్తువులను దోచుకోవడం నిందితుడి నేర విధానమని పోలీసులు తెలిపారు. రాత్రి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా అత్యవసర పోలీస్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.





