తమ్మిడికుంట చెరువు త్వరలో ప్రజలకు అందుబాటులోకి

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామెట్‌లో ఉన్న తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ, అభివృద్ధి పనులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ తమ్మిడికుంట చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెరువును ప్రజలకు అంకితం చేయనున్నట్లు తెలిపారు. చెరువులో జరిగిన ఆక్రమణలను తొలగించి, కుచించుకుపోయిన విస్తీర్ణాన్ని పునరుద్ధరించడంతోపాటు నాలాల పునరుద్ధరణ, చెరువు రక్షణ చర్యలను చేపట్టామని పేర్కొన్నారు. చెరువుకు పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

చెరువులోకి కలుషిత నీరు చేరకుండా ప్రత్యేక యూజీడీ (UGD) మళ్లింపు పైప్‌లైన్, ఎస్‌టీపీ (STP) ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. చెరువు కట్ట బలోపేతం, అలుగు మరమ్మత్తులు, ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్ నిర్మాణం వంటి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తమ్మిడికుంట చెరువును సుందరవనంగా తీర్చిదిద్దడంతోపాటు తామర పూల పెంపకం ద్వారా చెరువు అందాన్ని పెంచనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేలా చెరువును అభివృద్ధి చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులను ఇదే తరహాలో సుందరీకరించి, ఆక్రమణలు, కాలుష్యం లేకుండా సంరక్షించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జంగయ్య యాదవ్, రామచందర్, సర్వర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here