సైబరాబాద్‌లో ఐదు ప్రధాన దేవాలయాల్లో దివ్య వ్యర్థాల ప్రత్యేక సేకరణ

శేరిలింగంప‌ల్లి, జూలై 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పర్యావరణ పరిరక్షణతోపాటు శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూలై 18న శనివారం ఉదయం 8:30 గంటల నుంచి 11:00 గంటల వరకు కార్పొరేషన్ పరిధిలోని ఐదు ప్రధాన దేవాలయాల్లో దివ్య వ్యర్థాల సేకరణ ప్రత్యేక కార్యక్రమం (Divine Waste Collection Drive) నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని CMC పారిశుధ్య సిబ్బంది, వాలంటీర్లు సంయుక్తంగా చేపట్టనున్నారు. దేవాలయాల్లో పూజల అనంతరం ఉత్పత్తి అయ్యే పూలు, ఆకులు, ఇతర దివ్య వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి, వేరు చేసి, రీసైక్లింగ్‌తోపాటు పర్యావరణహిత విధానాల్లో నిర్వహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు.

మాదాపూర్ స‌ర్కిల్ ప‌రిధిలోని కొండాపూర్ వైట్ ఫీల్డ్స్‌లో ఉన్న సీతారామాంజ‌నేయ స్వామి దేవాల‌యం, ఆల్విన్ కాల‌నీ స‌ర్కిల్‌లోని నిజాంపేట సెవెన్ హిల్స్ రోడ్డులో ఉన్న శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యం, కొంప‌ల్లి స‌ర్కిల్‌లోని శివాల‌యం, నిజాంపేట స‌ర్కిల్ ప‌రిధిలోని ప్ర‌గ‌తి న‌గ‌ర్‌లో ఉన్న సాయిబాబా ఆల‌యం, మేడ్చ‌ల్ స‌ర్కిల్ ప‌రిధిలోని మేడ్చ‌ల్ రైల్వే అండ‌ర్ పాస్ స‌మీపంలో ఉన్న శ్రీ రామ‌లింగేశ్వ‌ర స్వామి దేవాల‌యాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దేవాలయ కమిటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, వాలంటీర్లు, భక్తులు, స్థానిక ప్రజలు చురుకుగా పాల్గొని సహకరించాలని CMC కమిషనర్ సృజ‌న‌ విజ్ఞప్తి చేశారు. పరిశుభ్రమైన, హరితమైన, పర్యావరణహిత సైబరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here