శేరిలింగంపల్లి, జూలై 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ పరిధిలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని ERO నారాయణ్ అమిత్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారులు, సూపర్వైజర్లతో కలిసి వివిధ ప్రాంతాలను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. రాయదుర్గం రెయిన్బో కాలనీ, పైలం కౌంటీ, మసీదుబండ, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, పటేల్ పార్క్, కొండాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రాంతాల్లో జరుగుతున్న SIR ప్రక్రియను పరిశీలించిన ERO అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సేకరించిన దరఖాస్తులను అదే రోజు ఆన్లైన్లో నమోదు చేసి ఎలాంటి పెండింగ్ లేకుండా డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో డూప్లికేట్ లేదా తప్పుడు నమోదులు లేకుండా 100 శాతం స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపొందించాలని సూచించారు.

అలాగే SIR కార్యక్రమం ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువులోపు SIR పనులను పూర్తి చేయాలని అన్ని స్థాయిల అధికారులకు ERO నారాయణ్ అమిత్ స్పష్టం చేశారు.





