వరుస బైక్‌ చోరీలకు చెక్‌.. యువకుడి అరెస్ట్‌, 3 బైక్‌లు స్వాధీనం

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి మూడు చోరీకి గురైన బైక్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మేకల మణికంఠ అనే యువకుడు హోటల్‌లో ఫ్రంట్‌ ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇళ్ల ముందు, హాస్టళ్ల వద్ద, ఇతర పార్కింగ్‌ ప్రదేశాల్లో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడు. బైక్‌ ప్లగ్‌ను తొలగించి వైర్లను కనెక్ట్‌ చేసి వాహనాలను స్టార్ట్‌ చేసి తీసుకెళ్లేవాడని పోలీసులు తెలిపారు.

పెట్రోలింగ్‌లో భాగంగా అయ్యప్ప సొసైటీ, మాదాపూర్‌ వద్ద అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మణికంఠను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు బైక్‌ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడి నివాసం సమీపంలో దాచిన 03 చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here