ఆటో డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. శేరిలింగంపల్లిలో BMS ఆధ్వర్యంలో ర్యాలీ

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రాష్ట్రవ్యాప్తంగా బీఎంఎస్‌ (BMS) చేపట్టిన డ్రైవర్ జాగో ఆందోళన్ లో భాగంగా ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శేరిలింగంపల్లి సర్కిల్‌ వద్ద ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 23వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభం కావాల్సిన ఆటో, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల బంద్‌, సమ్మెను విరమించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారని, నవంబర్ 1న జేఏసీతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారని బీఎంఎస్ నాయకులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని బీఎంఎస్ నిర్ణయించిందన్నారు.

ఈ కార్యక్రమానికి బీఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్లపూడి సత్యనారాయణ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల వెల్ఫేర్ బోర్డు జీఓను వెంటనే విడుదల చేయాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. అలాగే ఆటో, ట్యాక్సీ, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి పరిష్కార మార్గం చూపాలని సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో రాములు, సురేష్‌, యాదయ్య, శేఖర్‌, భీమయ్య, వెంకటయ్య, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల ఐక్యతే బలం.. ఐక్యంగా ఉందాం.. హక్కులను సాధించుకుందాం అని బీఎంఎస్‌ నాయకులు పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here