శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ నానక్‌రామ్‌గూడలో భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనలతో ఈ కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరై మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల్లో 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంలో భాగంగా నానక్‌రామ్‌గూడ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలు పరిస్థితిని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి, గచ్చిబౌలి డివిజన్‌లకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






