మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మాదాపూర్‌లోని గుట్టల బేగం పేటకు చెందిన సుమన్ కుమార్ యాదవ్ ఇనార్బిట్ మాల్‌లోని చట్నీస్ హోటల్‌లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 25వ తేదీన రాత్రి 11.15 గంటల సమయంలో పని ముగించుకున్న సుమన్ కుమార్ యాదవ్ తన స్నేహితులు నాబోత్ కుమార్ యాదవ్, జ్ఞాన్ యాదవ్‌లతో కలిసి ద్విచక్ర వాహనం (టీఎస్ 07 ఈవీ 6285)పై ఇనార్బిట్ మాల్ నుంచి మాదాపూర్ సీవోడీ జంక్షన్ వైపుకు వస్తున్నాడు. ఈ క్రమంలో దుర్గం చెరువు ఎన్‌సీసీ బిల్డింగ్ వద్దకు రాగానే అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ లారీ (టీఎస్ 08 యూఎఫ్ 6508) వారి ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా లారీ నడిపించడం వల్ల ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ముగ్గురూ కింద పడ్డారు. ఈ క్రమంలో సుమాన్ కుమార్ యాదవ్ తల మీద నుంచి లారీ టైర్లు వెళ్లాయి. దీంతో అతను తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు సుమన్ కుమార్ యాదవ్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించి నాబోత్ కుమార్ యాదవ్ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


