శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): నల్లగండ్లలో ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై డా. శరత్ బాబు, ఆయన కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ సంతోష్ కుమార్ కొల్లూర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ నెల 20న ఉదయం 11 గంటలకు నల్లగండ్ల ఎస్‌బీఐ బ్యాంక్ సమీపంలో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహిస్తుండగా, వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్రాఫిక్‌ను సాఫీగా సాగించేందుకు ఫుట్‌పాత్‌పై మూసుకుపోయిన మట్టిని హైడ్రా సిబ్బందితో తొలగించి, నిల్వ నీటిని సమీపంలోని ఖాళీ స్థలంలోకి మళ్లించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.

అయితే ఆ స్థలం యజమాని డా. శరత్ బాబు, ఆయన కుమారుడు అక్కడికి వచ్చి నీటిని తమ స్థలంలోకి వెళ్లనీయకుండా అడ్డుకోవడంతోపాటు, అధికారిక విధులు నిర్వహించకుండా అడ్డంకులు సృష్టించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రోడ్డుపై నిలిచిన నీరు వెళ్లకుండా మట్టి వేసి అడ్డుకున్నారని కూడా ఆరోపించారు. అలాగే జూలై 22న ఉదయం 10 గంటలకు రోడ్డుపై నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగించి ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు చేపడుతుండగా, డా. శరత్ బాబు అక్కడికి వచ్చి నేనెవరో తెలుసా? అంటూ నీటిని తొలగించకుండా అడ్డుకున్నారని, దీంతో ట్రాఫిక్ అంతరాయం మరింత పెరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత మూడు రోజులుగా తన అధికారిక విధుల నిర్వహణకు నిందితుడు నిరంతరం ఆటంకం కలిగిస్తున్నాడని, నిల్వ నీటిని తొలగించేందుకు వచ్చిన హైడ్రా సిబ్బందిని కూడా విధులు నిర్వహించకుండా అడ్డుకున్నట్లు కానిస్టేబుల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా డా. శరత్ బాబు, ఆయన కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





