శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం ERO, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ అధ్యక్షతన జోనల్ కార్యాలయంలో బుధవారం కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి నోడల్ అధికారులు, సూపర్‌వైజర్లు, ఆయా సర్కిళ్లకు చెందిన AEROలు హాజరయ్యారు. ఈ సందర్భంగా SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమాల పురోగతిని సమీక్షించిన ERO నారాయణ్ అమిత్ పలు కీలక సూచనలు చేశారు. నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని, ఫీల్డ్ వెరిఫికేషన్‌లో ఎలాంటి లోపాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి బూత్ పరిధిలో హెల్ప్ డెస్క్‌లను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. అలాగే BLOలు, సూపర్‌వైజర్లు పరస్పర సమన్వయంతో పనిచేసి SIR ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. విధుల నిర్వహణలో బాధ్యత, నిబద్ధతతో వ్యవహరించాలని, చిన్న పొరపాటుకూ అవకాశం ఇవ్వకుండా పారదర్శకంగా పనులు నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ERO నారాయణ్ అమిత్ సూచించారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






