ఎల్లమ్మబండ 100 ఫీట్ రోడ్డు విస్తరణకు వేగం పెంచాలి: ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూన్ 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఉషముళ్ళపూడి కమాన్ నుంచి గాజులరామరం వరకు వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో చేపడుతున్న 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో కలిసి పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఉషముళ్ళపూడి కమాన్ నుంచి గాజులరామరం వరకు ఉన్న రహదారిపై తీవ్ర ట్రాఫిక్ సమస్య కారణంగా ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా 100 ఫీట్ రోడ్డు విస్తరణ చేపట్టినట్లు పేర్కొన్నారు. గతంలో అధికారులతో కలిసి ఉషముళ్ళపూడి కమాన్ నుంచి సిక్కుల బస్తీ వరకు పాదయాత్ర నిర్వహించి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించిన విషయాన్ని గుర్తు చేశారు.

రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న అవరోధాలను తొలగిస్తూ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు మధ్యలో ఉన్న బండరాళ్ల తొలగింపు, విద్యుత్ స్థంభాల స్థానభ్రంశం, చెట్ల కొమ్మల తొలగింపు వంటి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పనుల సమయంలో దెబ్బతిన్న మంచినీటి పైప్‌లైన్‌ను వెంటనే పునరుద్ధరించినట్లు వెల్లడించారు. పనుల‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని అధికారులకు స్పష్టం చేశారు. రోడ్డు డివైడర్ మధ్యలో సుందరీకరణ పనులు కూడా చేపట్టాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మిగిలిన అడ్డంకులను త్వరితగతిన తొలగించాలని కోరారు. 100 ఫీట్ రోడ్డు విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గడంతోపాటు ప్రజలకు సమయం, ఇంధనం ఆదా అవుతుందని ఆరెకపూడి గాంధీ అన్నారు. ట్రాఫిక్ రహిత, సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ కల్పించడమే తమ లక్ష్యమని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటానని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here