చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్ లోని శ్రీదేవి థియేటర్ ఎదురుగా శ్రీవిద్య తన సోదరి జ్యోతితో కలిసి నివాసం ఉంటోంది. వీరి మరో సోదరితో కలిసి తండ్రి లింగంపల్లిలోని టెలికార్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నాడు. కాగా శ్రీవిద్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన చందానగర్‌కు చెందిన ముషాం శబరీష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. తరువాత కొన్ని నెలలు వీరి దాంపత్య జీవితం బాగానే సాగింది. కాగా వినాయక చవితి అనంతరం శ్రీవిద్యకు కష్టాలు మొదలయ్యాయి. ఆమెను భర్త శబరీష్ చిన్న చిన్న విషయాలకు వేధింపులకు గురి చేసేవాడు. అసభ్య పదజాలంతో దూషించేవాడు. ఈ నెల 17వ తేదీన శబరీష్ తన స్నేహితులతో పార్టీ ఉందని చెప్పి బెంగళూరుకు వెళ్లాడు. అంతకు ముందు రోజు కూడా అతను తన భార్యను యథావిధిగా వేధింపులకు గురి చేశాడు. ఈ క్రమంలో అతను బెంగళూరుకు వెళ్లగానే ఆమె తన సోదరి జ్యోతి ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వచ్చి అందులో 5వ అంతస్థు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయం గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆమె తీవ్రగాయాలకు గురై మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు శ్రీవిద్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
