శేరిలింగంపల్లి, జూలై 25 (నమస్తే శేరిలింగంపల్లి): పనిచేస్తున్న ఇంటికి కన్నం వేసిన ఓ వ్యక్తి ఆ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్ ఫ్రెండ్స్ కాలనీ సాయి కీర్తి ఎస్టేట్ ఎ బ్లాక్ ఫ్లాట్ నం.112లో బుస్సా నర్సింగ రావు, చంద్రకళ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ ఫ్లాట్‌లోనే ముక్కమళ్ల రవి (40) అనే వ్యక్తి కేర్ టేకర్‌గా పనిచేస్తున్నాడు. జూలై 24వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో తన చొక్కా ఇస్త్రీ చేయించుకుంటానని చెప్పిన రవి బయటకు వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చి చూడగా పూజ గదిలోని డెస్క్‌లో ఉన్న పలు బంగారు ఆభరణాలు కనిపించలేదు. మొత్తం రూ.40వేల విలువైన సొత్తు చోరీకి గురైందని, తమకు రవి మీద అనుమానం ఉందని ఆ దంపతులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.





