సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): టీవీ సీరియల్ నటుడిగా ఫేస్‌బుక్ లో పరిచయం అయి ఓ మహిళను బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమె నుంచి డబ్బులను వసూలు చేయడమే కాక ఆమె నగ్న చిత్రాలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఓ వ్యక్తికి న్యాయమూర్తి శిక్ష విధించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏపీలోని విశాఖపట్నం మధురవాడకు చెందిన జంబాడ లక్ష్మీ వరప్రసాద్ నగరంలోని మల్లంపేటకు చెందిన ఓ మహిళకు ఫేస్‌బుక్‌లో రవికృష్ణ అనే టీవీ సీరియల్ నటుడి పేరు చెప్పి పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో ఆమె నిజమే అని నమ్మి అతని ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసింది. అయితే ఆమెను సెల్ఫీ పంపించమని అతను అడిగాడు. దీంతో ఆమె ముఖం కనబడకుండా ఫొటో పంపింది. ఈ క్రమంలో అతను మొదట వ్యక్తిగత అవసరాలు ఉన్నాయని చెప్పి రూ.2వేలు ఇవ్వాలని కోరగా ఆమె ఆన్‌లైన్‌లో ట్రాన్స్ ఫర్ చేసింది. అయితే తరువాత అతను ఆమె ఫోటోను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా తయారు చేసి వాటిని ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించాడు. అలా చేయకుండా ఉండాలంటే తనకు డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆమె రూ.5వేలు ఇచ్చింది. అతను మొదట రూ.30వేలు, తరువాత ఏకంగా రూ.2.20 లక్షలు అడిగాడు. ఈ క్రమంలో అతని వేధింపులను తట్టుకోలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. ఈ మేరకు అతన్ని కూకట్‌పల్లి 9వ అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా.. నేరం అంగీకరించడంతో న్యాయమూర్తి అతనికి రూ.1వేయి ఫైన్‌తోపాటు 2 ఏళ్ల జైలు శిక్ష విధించారు. దీంతో పోలీసులు అతన్ని శిక్ష నిమిత్తం జైలుకు తరలించారు.