చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): గతంలో జనంకోసం సంస్థ ద్వారా పరిరక్షించిన ప్రభుత్వభూమిలో ప్రైవేటు వ్యక్తులు మరోసారి ఆక్రమణలకు పాల్పడ్డారని, ప్రభుత్వ భూమిని పరిరక్షించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని జనంకోసం సంస్థ అధ్యక్షులు కసిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శేరిలింగంపల్లి మండల తహశీల్దారు వంశీమోహన్‌ను కలిసిన ఆయన ఆధారాలతో ఫిర్యాదు చేశారు. చందానగర్ సర్వేనెంబరు 170 లో 10 గుంటల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమి ఉందని, 2013 సంవత్సరంలో ఈ భూమిలో రంగని కిష్టయ్య అనే వ్యక్తి గుడిసె వేసుకుని నివాసముంటుండగా కొందరు వ్యక్తులు అతనిని బెదిరించి కాంపౌడ్ వాల్ ఏర్పాటు చేసి గేటు పెట్టారని తెలిపారు.
ఈ విషయమై అప్పటి మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా ప్రభుత్వ భూమిగా సూచిస్తూ సూచిక బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ స్థలంలో ప్రభుత్వ సూచిక బోర్డుకు బదులుగా భాను కన్స్ట్రక్షన్స్ అనే ప్రైవేటు సంస్థకు చెందినట్లుగా బోర్డు ఏర్పాటు చేసి ఉందని తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ భూమిగా ఉన్న స్థలం నేడు ప్రైవేటుగా ఎలా మారిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణపై సమగ్ర దర్యాప్తు చేపట్టి స్థలాన్ని కాపాడాలని ఆయన కోరారు.