మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని మీనాక్షి స్కై లాంజ్ సమీపంలో చిరంజీవి (40) అనే వ్యక్తి గుడిసెల్లో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా ఈ నెల 12వ తేదీన అతను ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం తిరిగి రాలేదు. అతనికి విపరీతంగా మద్యం సేవించే అలవాటు ఉన్నందున అతనే వస్తాడని అతని భార్య అనుకుంది. కానీ అతను తిరిగిరాకపోవడంతో ఆమె ఈ నెల 14వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా మంగళవారం సాయంత్రం జయభేరి బిల్డింగ్ సమీపంలోని ఖాళీ స్థలంలో చెట్ల పొదలో ఒక తుమ్మ చెట్టుకు అతను ఉరి వేసుకుని చనిపోయి కనిపించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరంజీవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా అతను అతిగా మద్యం సేవించడం వల్ల గానీ లేదా మరే ఇతర కారణం వల్ల అయినా గానీ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.






