నమస్తే శేరిలింగంపల్లి: జనాలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా సరే సైబర్ నేరగాళ్లు ఏదో ఒక రూపంలో వారిని మోసం చేస్తూనే ఉన్నారు. జనాలకు ఏదో ఒకటి ఆశ చూపి వారి డబ్బు కాజేస్తున్నారు. ఇటీవలి కాలంలో నూతన తరహా సైబర్ మోసాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు అలాంటి మోసాల పట్ల, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
లక్కీ వీల్ స్పిన్ మోసాలతో జాగ్రత్త…
ఇటీవలి కాలంలో ప్రజలకు వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు, ఈ-కామర్స్ సైట్లలో లక్కీ స్పిన్ వీల్ పేరిట లింక్‌లు వస్తున్నాయి. వాటిల్లో వీల్‌ను తిప్పితే ఖరీదైన గిఫ్ట్ మీ సొంతం అవుతుంది అంటూ జనాలను ఆశ పెడుతున్నారు. దీంతో జనాలు వాటికి ఆశపడి వీల్ తిప్పగానే సహజంగానే వారికి ఏదో ఒక గిఫ్ట్ అందులో వస్తుంది. అయితే గిఫ్ట్ వచ్చిందనే సాకుతో మోసగాళ్లు ఓ లింక్‌ను పంపించి దానిపై క్లిక్ చేయమని చెబుతారు. అనంతరం అందులో యూజర్ల వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం ఎంటర్ చేయమంటారు. తరువాత కొంత మొత్తంలో ఫీజు చెల్లించాలని చెప్పి రూ. లక్షలకు లక్షలు వసూలు చేసి తరువాత పత్తా లేకుండా పోతారు. ఇటీవలి కాలంలో ఈ తరహా లక్కీ వీల్ స్పిన్ మోసాలు బాగా పెరిగిపోయాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఇటీవలి కాలంలో బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసేందుకు వస్తున్నారు. ఈ క్రమంలో లక్కీ వీల్ స్పిన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలు ఈ జాగ్రత్తలు పాటించాలి…
* సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో కనిపించే లక్కీ వీల్ స్పిన్ లింక్‌లను ఎట్టి పరిస్థితిలోనూ క్లిక్ చేయరాదు.
* ఆ లింక్‌లు అసలువేనా, నకిలీవా అని వెరిఫై చేసుకోవాలి. అవి మోసపూరిత సైట్లకు రీడైరెక్ట్ అవుతాయి. కనుక ఆ విషయాన్ని పరిశీలించాలి.
* ఆన్‌లైన్‌లో గిఫ్ట్ వచ్చిందని, బహుమతి ఇస్తామని ఎవరైనా ఆశ చూపితే స్పందించకూడదు. అలాంటి ఆఫర్లను నమ్మరాదు.
* అనుమానాస్పదంగా కనిపించే లింక్‌లను క్లిక్ చేసి అందులో సమాచారం ఎంటర్ చేయరాదు. దుండగులు మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారాన్ని చోరీ చేసేందుకు అవకాశం ఉంటుంది.
* మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఇతరులకు చెప్పరాదు.
* బ్యాంకులు ఎట్టి పరిస్థితిలోనూ వివరాలు చెప్పాలని కస్టమర్లకు ఫోన్లు చెయ్యవు. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి.