శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): హోటల్ గదిలో మహిళను హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, ఫోన్‌ను తస్కరించి పారిపోయిన వ్యక్తిని చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరులోని ఇంద్రేశం గ్రామానికి చెందిన జి.నరసమ్మ (39) చందానగర్‌లోని నైట్ ఐ ఓయో హోటల్‌లో రూమ్ నం.405లో యాదాద్రి భువనగిరి మండలానికి చెందిన మందల కుమార్ (47) అనే వ్యక్తితో కలసి ఉండగా, అదను చూసుకుని ఆమెను స్కార్ఫ్‌తో మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, ఫోన్‌తో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 2.360 గ్రాముల బంగారు చెవి రింగులు, మాటీలు, 444 గ్రాముల వెండి పట్టీలు, 33.850 గ్రాముల వెండి మెట్టెలు, బాధితురాలి ఫోన్‌తోపాటు, నిందితుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శేరిలింగంపల్లి డీసీపీ, ఆర్‌సీ పురం ఏసీపీల పర్యవేక్షణలో చందానగర్ పోలీసులు నిందితున్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నందుకు ఉన్నతాధికారులు వారిని అభినందించారు.






