శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్న ఓ యువతికి తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ సహాయం అందేలా చేశారు. వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్‌కు చెందిన ఆశ అనే మైనారిటీ యువతి పుట్టుకతోనే కుడి చెయ్యి చిన్నగా ఉండటంతో చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవిస్తోంది. రోజువారీ పనుల్లో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న ఆమెకు సహాయం అందించేందుకు శివకృష్ణ ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆమె సమస్య తెలుసుకున్న వెంటనే స్పందించి భారత్ వికాస్ పరిషత్ వికలాంగుల పునర్వసతి కేంద్రం ట్రస్ట్‌ను సంప్రదించి, ఆశకు ఆర్టిఫిషియల్ రైట్ హ్యాండ్ అందేలా చర్యలు తీసుకున్నారు. శివకృష్ణ చొరవతో జరిగిన ఈ సహాయం వల్ల ఆశ జీవితంలో కొత్త వెలుగు కనిపించింది. ఆమె రోజువారీ పనులు సులభంగా చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ఇంకా ఇలాంటి అవసరంలో ఉన్నవారు చాలామంది ఉన్నారని, దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన దివ్యాంగ మహిళలకు విద్య, ఉపాధి, వివాహం వంటి అంశాల్లో ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా దాతలు ముందుకు వస్తే ఆశ పెళ్లికి ఆర్థిక సాయం చేయవలసిందిగా వికలాంగుల అందరి తరపున మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ కేంద్రం ట్రస్ట్ మేనేజర్ నరేంద్ర, కూకట్ పల్లి సీనియర్ జర్నలిస్టు నాగరాజు, జినుక రఘు సంధ్య , టెక్నీషియన్ రఘు, మధు, స్వామి తదితరులు పాల్గొన్నారు.





