- ముఠాను పట్టించిన టీపీవైసీ రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్ దుర్గం శ్రీహరి గౌడ్
శేరిలింగంపల్లి, మార్చి 30 (నమస్తే శేరిలింగంపల్లి): కల్తీ ఆహారాలను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లు రోజు రోజుకీ తమ దందా పంథాను మారుస్తున్నారు. ఆహారాలను ఎలా కల్తీ చేయాలా అని ఆలోచించి మరీ తమ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఇదే తరహాలో శేరిలింగంపల్లిలోని హైటెక్‌సిటీలో కల్తీ నూనెలను తయారు చేసి విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. వారు హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి వాడిన నూనెను సేకరించి దాంతో కల్తీ నూనె తయారు చేసి విక్రయిస్తూ సొమ్ము గడిస్తున్నారు. అదే క్రమంలో వారిని పోలీసులు అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కల్తీ నూనెను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులో సోమవారం అనుమానాస్పదంగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ ఆటోను టీపీవైసీ రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్ దుర్గం శ్రీహరి గౌడ్ గుర్తించారు. అందులో సుమారు 20 డబ్బాలు ఉండగా అనుమానం వచ్చిన ఆయన వాహనం నడుపుతున్న వ్యక్తులను నిలదీశారు. దీంతో వారు హోటళ్లు, రెస్టారెంట్లలో వాడిన నూనెను సేకరిస్తున్నామని సమాధానం చెప్పారు. అయితే వాడిన నూనె ఎందుకు అని ప్రశ్నించగా వారు స్పష్టత లేని సమాధానాలు ఇచ్చారు. దీంతో ఆయన మళ్లీ ప్రశ్నించగా వారు అసలు విషయం బయట పెట్టారు. తాము ఆయా ప్రాంతాల నుంచి వాడిన నూనెను లీటర్‌కు రూ.20 చొప్పున సేకరిస్తున్నామని, దాంతో నూనె తయారు చేసి వీధి వ్యాపారులకు లీటర్‌కు దాదాపు రూ.70 చొప్పున అమ్ముతూ రూ.50 లాభం పొందుతున్నామని అంగీకరించారు. అయితే ఆ వ్యాపారానికి అనుమతి ఉందా అని ప్రశ్నిస్తూ పత్రాలను చూపించమని అడగ్గా వారు సరైన పత్రాలను చూపించకుండా తప్పించుకునే యత్నం చేశారు. దీంతో శ్రీహరి గౌడ్ వెంటనే మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించగా వారు అత్యంత చాకచక్యంగా సంఘటనా స్థలానికి చేరుకుని సదరు వ్యక్తులను అరెస్టు చేశారు.

ఆ వ్యక్తులు ముఠాగా ఏర్పడి మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని రెస్టారెంట్లలో వాడిన నూనెను సేకరించి దాంతో కల్తీ నూనె తయారు చేసి విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. వారు తమ వ్యాపారం కోసం కర్ణాటకలో రిజిస్టర్ అయిన ఆటో (కేఏ53ఏఏ8482)ను వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ఆటోతోపాటు వారి వద్ద ఉన్న 20 నూనె డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






