న‌కిలీ ఇన్సూరెన్స్ పాల‌సీల ముఠా గుట్టు ర‌ట్టు

  • 11 మందిని అరెస్టు చేసిన శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు
  • 1125 న‌కిలీ పాల‌సీలు, ప‌లు సామ‌గ్రి, వాహ‌నాలు స్వాధీనం
  • ఇన్‌స్టంట్ ఇన్సూరెన్స్ పాల‌సీలు తీసుకోవ‌ద్ద‌ని పోలీసుల హెచ్చ‌రిక

సైబ‌రాబాద్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): న‌కిలీ ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను త‌యారు చేసి విక్ర‌యిస్తున్న ఓ ముఠాకు చెందిన 11 మంది స‌భ్యుల‌ను శంషాబాద్ జోన్‌కు చెందిన ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రిల‌య‌న్స్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏరియా మేనేజ‌ర్ గురువ‌ర్ధ‌న్ పెర్ల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు న‌కిలీ ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను త‌యారు చేస్తున్న ముఠాపై దాడి చేశారు. ఈ క్ర‌మంలో మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో నిందితులు

వారు రిల‌య‌న్స్, కోట‌క్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇఫ్‌కో టోకియో, చోళ ఎంఎస్‌, ఫ్యూచ‌ర్, శ్రీ‌రాం, రాయ‌ల్ సుంద‌రం త‌దిత‌ర కంపెనీల‌కు చెందిన న‌కిలీ ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను త‌యారు చేసి విక్ర‌యిస్తున్నార‌ని పోలీసులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే నిందితుల నుంచి పోలీసులు 1125 న‌కిలీ ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను, 3 స్టాంపుల‌ను, కంప్యూట‌ర్ సిస్ట‌మ్‌లు, ప్రింట‌ర్లు, ఇత‌ర ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

కాగా ఈ ఘ‌ట‌న‌లో జి ర‌మేష్ (30), టి.సాయిరాం (31), జి.గోవ‌ర్ధ‌న్ (40), జి.ర‌మేష్ (40), జి.రాజు (36), ఎ.ప్ర‌వీణ్ (23), జి.సుధీర్ కుమార్ (26), జి.కృష్ణ (30), ఎం.శంక‌ర్ )25), జితేంద‌ర్ కుశ్వా (35), ర‌వి క‌డిగ‌ళ్ల (29) అనే 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరు హైవేలు, ఆర్‌టీవో ఆఫీస్‌ల వ‌ద్ద వాహ‌న‌దారుల‌కు మాయ‌మాట‌లు చెప్పి వారికి ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను అంట‌గ‌డుతారు. కానీ అవి న‌కిలీవి కావ‌డంతో వారి గుట్టు ర‌ట్ట‌యింది. వారు రూ.5వేల నుంచి రూ.10వేల వ‌ర‌కు ఒక్కో పాల‌సీని విక్ర‌యించేవార‌ని పోలీసులు తెలిపారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహ‌నాలు

కాగా నిందితుల నుంచి 1125 న‌కిలీ ఇన్సూరెన్స్ పాల‌సీల‌తోపాటు రూ.57వేల న‌గ‌దు, 3 పొల్యూష‌న్ టెస్టింగ్ వాహ‌నాలు (ఏపీ28ఎక్స్‌4428, ఏపీ29యు4358, ఏపీ09టీఏ8565), 3 స్టాంపులు, 2 ల్యాప్‌టాప్‌లు, 8 రిల‌య‌న్స్ ఇన్సూరెన్స్ ఖాళీ లెట‌ర్ హెడ్స్‌, 6 సీపీయూలు, 5 మానిట‌ర్లు, 3 బ్లాక్ అండ్ వైట్ ప్రింట‌ర్లు, 4 క‌ల‌ర్ ప్రింట‌ర్లు, 11 ఫోన్లు, 3 కీబోర్డులు, 1 మౌజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంద‌ర్బంగా పోలీసులు వాహ‌న‌దారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

* ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను తీసుకునేముందు వాహ‌న‌దారులు తాము పాల‌సీ తీసుకుంటున్న ఏజెంట్ లేదా ఏజెన్సీకి పాల‌సీల‌ను ఇచ్చేందుకు అధికారం ఉందా లేదా అనే విష‌యం తెలుసుకోవాలి.
* ఇన్సూరెన్స్ పాల‌సీ తీసుకున్నాక ప‌త్రాల‌ను ఇచ్చేందుకు 12 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. క‌నుక ప‌త్రాల‌ను వెంట‌నే ఇస్తామంటే అలాంటి పాల‌సీల‌ను న‌కిలీ పాల‌సీలుగా గుర్తించాలి.
* ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను పోస్టు ద్వారా మాత్ర‌మే డెలివ‌రీ చేస్తారు.
* ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను ఇచ్చేందుకు పొల్యూష‌న్ కంట్రోల్ వాహ‌నాల‌కు ఎలాంటి అనుమ‌తి ఇవ్వ‌లేదు.
* ఎవ‌రైనా తెలిసి కూడా న‌కిలీ ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను తీసుకుంటే వారిపై కూడా చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోబ‌డుతాయి.
* న‌కిలీ ఇన్సూరెన్స్ తీసుకుంటే రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డితే ఎలాంటి ఇన్సూరెన్స్ ల‌భించ‌ద‌ని గుర్తుంచుకోవాలి. అలాగే వాహ‌నాల‌కు క‌లిగే న‌ష్టాల‌కు కూడా ఇన్సూరెన్స్ క‌వ‌రేజీ ల‌భించ‌దు.
* ఎవ‌రైనా న‌కిలీ ఇన్సూరెన్స్‌లు ఇస్తున్నార‌ని తెలిస్తే వెట‌నే డ‌య‌ల్ 100 లేదా సైబ‌రాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444 లో స‌మాచారం అందించాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here