- శుభోదయ కాలనీలో మొక్కలు నాటిన డీసీ, మరో ముగ్గురికి మొక్కలు నాటాలని చాలెంజ్
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జిహెచ్ఎంసి చందానగర్ సర్కిల్ డీసీ ఎన్. సుధాంష్ మంగళవారం మొక్కలు నాటారు. కూకట్ పల్లి డిప్యూటి కమిషనర్ ప్రశాంతి విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన ఆయన చందానగర్ డివిజన్ లోని శుభోదయ కాలనీలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా డీసీ సుధాంష్ మాట్లాడుతూ.. చందానగర్ సర్కిల్‌లో హరితహారం నేపథ్యంలో ఇప్పటికే అనేక చోట్ల మొక్కలను నాటడం జరిగిందన్నారు. ఈ క్రమంలోనే గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలను నాటినట్లు తెలిపారు. ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటి కమిషనర్ వెంకన్న, చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ లకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. కాగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలను నాటినందుకు డీసీ సుధాంష్‌కు ఎంపీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.





